ఎడిటోరియల్

Tuesday, November 6, 2018

ఆర్.ఎస్.ఎస్ - బి.జె.పి ల విచ్చిన్నకర - దాటవేత ఎత్తుగడలను తిప్పికొట్టండి!

యమ్.యల్ అప్డేట్ అక్టోబర్ 23 సంపాదకీయం.


ఆర్.ఎస్.ఎస్ - బి.జె.పి ల విచ్చిన్నకర - దాటవేత ఎత్తుగడలను తిప్పికొట్టండి!

       సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఆర్.ఎస్.ఎస్ – బి.జె.పి ల ఎత్తుగడలు రోజులు గడుస్తున్న కొద్ది స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ ఎత్తుగడలు ప్రధానంగా ఈ మధ్య జరిగిన నాలుగు సంఘటనల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఒకటి, డిసెంబర్ 6,1992 వరకు బాబ్రి మసీదు ఉన్న ప్రదేశంలోనే రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయాలని మోడి ప్రభుత్వంపై ఆర్.ఎస్.ఎస్ ఒత్తిడి తీసుకురావడం. రెండు, 10 సం'ల నుండి 50 సం'ల వరకు వయస్సుగల స్త్రీలందరికి ప్రసిద్ధ శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పించాలని, అందుకు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సంధర్భంలో భా.జ.పా ఆ తీర్పును అమలు పరచవల్సింది పోయి,దానిని అమలు చేసేందుకు ప్రయత్నించిన కేరళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక క్యాంపెయిన్ ను చేపట్టడం. మూడు,ఉత్తరప్రదేశ్ త్రివేణి సంఘమంలో కుంభమేళా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో అల్లహాబాద్ నగరం, జిల్లాలకు "ప్రయాగరాజ్" గా పేరుమారుస్తూ తుగ్లఖ్ తరహాలో యోగి ఆదిత్యనాధ్ ఉత్తర్వులు జారిచేయటం. నాలుగు, నేతాజి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించిన చారిత్రక సంఘటన జరిగి 75 సం'లు కావస్తున్న తరుణంలో ఆ సంధర్బాన్ని పురస్కరించుకుని, సుభాష్ చంద్రబోస్ చారిత్రక వారసత్వాన్ని తమకు ఆపాదించుకునే కుటిల ప్రయత్నాన్ని మోడి చేయటం. ఇవన్ని కూడా చరిత్రను-ఇతిహాసాన్ని కలగాపులగం చేసి సంఘి-భాజపా ల కాషాయ-ఫాసిస్స్టు అజెండాకు అనుగుణంగా భారతదేశాన్ని తీర్చి దిద్దే ప్రయత్నానికి చట్టబద్దత తీసుకువచ్చే ప్రయత్నాలే.

         సంఘి మూకలు చేసే రామమందిర ప్రచారం సహజంగా రాముడికి అద్భుతమైన మందిరం నిర్మించడం పై కాకుండా బాబ్రి మసీదు కూల్చిన స్థలంలో కట్టడంపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ రకమైన పంతం వారు సహజంగా చెప్పే 16 వ శతాబ్దపు సంఘటనలకు ప్రతీకారంగా కాక, నేటి రాజకీయ పరిస్థితులలో  సుప్రీంకోర్టును-పార్లమెంట్ లాంటి రాజ్యాంగబద్ద సంస్థల ప్రాముఖ్యతను తగ్గించే కుటిల యత్నం. 1992 లో జరిగిన బాబ్రి మసీదు కూల్చివేత లాంటి చర్యలు సుప్రీంకోర్టు-పార్లమెంటు లను బేఖాతరు చేయడమైతే, 2018 లో వారి చర్యలు ఏకంగా వాటికి షరతులు నిర్దేశించే స్థాయికి చేరాయి. రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం చట్టం చేయాలని ఆర్.ఎస్.ఎస్ కోరుకుంటుంది, అందుకు సుప్రీంకోర్టే చొరవచేసి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసినా సరే, లేదా సుప్రీంకోర్టును తోసిపుచ్చి పార్లమెంటులో తన మెజారిటి ఉపయోగించి ప్రభుత్వమే చట్టం చేసినా పర్వాలేదు. ఇవంతా భారతదేశాన్ని హిందు రాష్ట్రంగా మార్చాలన్న సంఘి ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాజ్యాంగాలకు షరతులు నిర్దేశించే చర్యలే.


      రామమందిర విషయంలో ఏ విధంగా వ్యవహరించిందో, మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించింది. ఆర్.ఎస్.ఎస్ నాయకుడు మోహన్ భగవత్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు స్వేచ్చ-సమానత్వం అనే రాజ్యాంగ బద్ద వైఖరితో కాక మతపరమైన సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వవల్సిందని" బాహాటంగా ప్రకటన చేయడం జరిగింది. ఇవే సంఘి మూకలు, ముస్లిం మహిళలకు న్యాయం పేరుతో, మూడుసార్లు తలాఖ్ చెప్పి తక్షణం విడాకులు తీసుకునే ఇస్లాం మతంలోని ఒక విధానాన్ని రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతూ చూపిన అత్యుత్సాహం మనం మరచిపోలేదు. మూడు సార్లు తలాఖ్ విధానాన్ని క్రిమినల్ చర్యగా భావించి శిక్షార్హం చేస్తూ ఆర్డినెన్స్ తేవాలనే స్థాయికి ప్రచారాన్ని తీసుకువెళ్ళారు. ఈ నేపధ్యంలో, మహిళలకు ప్రవేశం విషయంలో శబరిమల ఆలయ బోర్డు - హజి ఆలి దర్గా ట్రస్ట్ బోర్దులు భిన్నంగా వ్యవహరించడం మనం గమనించాలి. హజి ఆలి దర్గా బోర్డు సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తే, ట్రావంకోర్ దేవస్థానం బోర్డు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేయడమే కాక "సెక్స్ టూరిజానికి" ఈ తీర్పు మరింత ఊతం ఇస్తుందని వ్యాఖ్యానించింది. మరోపక్క కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సుప్రీం తీర్పునుద్దేశించి "హిందు మత నమ్మకాలు-మనోభావాలతో ఆడుకునే విధంగా ఉందని" రెచ్చగొడుతూ భాద్యతారహిత వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ "మూడుసార్లు తలాఖ్" చెప్పే విధానానికి కాని, హజి ఆలి దర్గాలో మహిళల ప్రవేశాం విషయంలో కాని ముస్లింలు ఇదే వైఖరి అవలంబించి ఉంటే భా.జ.పా మరియు సంఘి మూకలు ఎంత రాద్ధాంతం చేసే వారో ఊహించటం పెద్ద కష్టమైన విషయం కాదు.

       ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ చట్టబద్ద పాలన గాలికొదిలి ఎన్ కౌంటర్ గిరి కొనసాగిస్తున్నాడు. అన్ని విధాల పాలన కుంటుబడి నియంతృత్వ పోకడ కొనసాగుతుంది. ప్రజాసంక్షేమం గాలికొదిలి పేర్లు మార్చే ప్రక్రియలో ఆదిత్యనాధ్ నిమగ్నమయ్యాడు. ముఘల్సరాయి పేరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ మార్చిన తర్వాత ఇప్పుడు తాజాగా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన అల్లహాబాది నగరానికి జిల్లాకు "ప్రయాగరాజ్" మారుస్తూ ఉత్తర్వులు జారి చేసాడు. ఈ పేరు మార్చే ప్రక్రియను అల్లహాబాద్ హైకోర్టుకు-యూనివర్సిటీకి వర్తింపచేస్తే దాని పర్యవసానం కొన్ని వేల కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. ఇది నోట్ల రద్దు స్థాయిలో వ్యర్ధ చర్యగా నిలిచిపోతుంది, దీనికి తోడు సాంస్కృతికంగా మూడత్వాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతుంది. అల్లహాబాద్-ప్రయాగ లు కొన్ని శతాబ్దాలుగా జంటనగరాలుగా ప్రసిద్ధి చెందాయి. ముఘల్ నాటి నుంచి నేటి వరకు కొనసాగిన అల్లహాబాద్-ప్రయాగల ఘనమైన చరిత్ర సంస్కృతి, సమాజంలోని ప్రతి క్షేత్రంలో అవధుల్లేని విధ్వంసానికి పాల్పడేందుకు మాత్రమే అధికారాన్ని వెలగబెడుతున్న సంఘి మూకలకు చెంపపెట్టులాంటిది. ఈ పేర్లు మార్చే ప్రక్రియ "రామమందిర" ప్రచారానికి, వారణాసి లో జరగబోయే ఎన్.ఆర్.ఐ ల సమ్మేళనానికి, అల్లహాబాద్ లో జరగబోయే కుంభమేళాలకు ఊపు తెచ్చే సరికొత్త విధానంగానే మనం అర్ధం చేసుకోవాలి. తద్వారా కూడగట్టే భాజపా శ్రేణుల ఉత్సాహం, ఉన్మాదం రాబోయే 2019 ఎన్నికలకు ఇంధనంగా కూడా పనికొస్తుంది.

             ఒకపక్క ఈ రకమైన సాంస్కృతిక రాజకీయ పోరాటాలు జరుగుతుంటే, సింగపూర్ గడ్డపై నేతాజి సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించిన 75 సంవత్సరాల చారిత్రక సంఘటన స్మరణ పేరుతో, సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని స్వంతం చేసుకునే కుటిల ప్రయత్నాన్ని మోది ప్రభుత్వం ప్రారంభించింది. "గత ప్రభుత్వాలన్ని, స్వాతంత్ర్య పోరాటంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ పాత్రను, ఆయన త్యాగాన్ని విస్మరించాయని, నరేంద్ర మోడినే నేతాజి కి నిజమైన వారసుడని, చివరకు మోడి యే భారత స్వాతంత్ర్య పోరాట వీరుడైన  నేతాజికి తగిన గౌరవాన్ని ఇచ్చారు" అని భాజపా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. గాంధి చిత్రాన్ని కేవలం వారి స్వచ్చభారత అభియాన్ క్యాంపెయిన్ కి ప్రచారకుడిగా ఉపయోగించుకున్నట్లే, సుభాష్ చంద్రబోస్ ను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం తెరపైకొచ్చింది. అందుకోసం సుభాష్ చంద్రబోస్ వామపక్ష రాజకీయాలు, ఆర్ధిక ప్రణాళికల అవసరంపై ఆయన చూపిన ప్రాముఖ్యత, అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్య అవసరం, సావర్కర్ హిందు మహాసభ విచ్చిన్నకర రాజకీయాలను, మతోన్మాద మూడత్వాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన ఆయన వైఖరిని వదిలేసి నేతాజి అంటే కేవలం భారతదేశ స్వాతంత్ర్యం కోసం రెండవ స్త్వాతంత్ర్య పోరాటంలో జపాన్-జర్మనిలతో చేతులు కలిపిన ప్రభావవంతమైన నాయకుడిగా మాత్రమే చిత్రీకరించేందుకు మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

             హిట్లర్, ముస్సొలిని, మొజొలతో చేతులు కలపాలన్న బోస్ రాజకీయ ఎత్తుగడలను కమ్యునిష్టులు అంగీకరించలేదు, ఆయనను తీవ్ర స్థాయిలో విమర్శించారు కూడా. కాని ఆజాద్ హింద్ ఫౌజ్(ఐ.ఎన్.ఎ) సైనికులను విడుదల చేయాలని జరిగిన దేశవ్యాప్త క్యాంపెయిన్ లో కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టులు ముందు వరుసలో ఉన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్, తాత్కాలిక ఆజాది హింద్ ప్రభుత్వాల కూర్పు భారతదేశ బిన్నత్వాన్ని, బహుళత్వాన్ని ప్రతిబింబించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను విడుదల చేయాలని చేసిన పోరాటం భారత స్వాతంత్ర్య పోరాటపు అంతిమ ఘట్టంలో యుద్ధ కేకగా చరిత్రలో నిలిచింది. ఎంతో మంది ఐ.ఎన్.ఎ నాయకులు కమ్యునిస్టు ఉధ్యమంలో చేరారు. ఐ.ఎన్.ఎ స్థాపనకు ముందు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాజకీయ పార్టి స్వాతంత్ర్య పోరాటానంతరం వామపక్ష శిబిరంలో భాగస్వామిగా కొనసాగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ లో అందరు స్త్రీలతో ఏర్పదిన ఝాన్సి రాణి రెజిమెంటుకు చీఫ్ గా ఉన్న కెప్టెన్ లక్ష్మి సెహగల్, తర్వాత భారత కమ్యునిష్ట్ పార్టి సీనియర్ మెంబర్ గా ఉండి, తర్వాతి కాలంలో మొదటి ఎన్.డి.ఎ హయాంలో భారత రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష అభ్యర్దిగా నిలిచారు. ఒకపక్క సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే, ఆర్.ఎస్.ఎస్ - హిందు మహా సభలు బ్రిటిష్ వారితో అంటకాగుతున్నారు. సావర్కర్ అయితే హిందు సైన్యాన్ని ఏకీకృతం చేసేందుకు, హిందు జాతీయతను పెంపొందించేందుకు ఏకంగా "బ్రిటిష్ సైన్యాన్ని హిందువులతో నింపండి" అని హిందువులందరికి పిలుపునిచ్చాడు. దీనికి హిందుత్వ అని పేరు కూడా ఇచ్చాడు. సుభాష్ చంద్రబోస్ త్యాగాన్ని-ఆయన పాత్రను విస్మరించారని ఇతరులను విమర్శించే ముందు, మోడి-ఆర్.ఎస్.ఎస్-భా.జ.పా లు భారత స్వాతంత్ర్య పోరాటానికి వారు చేసిన ద్రోహాన్ని, బ్రిటిష్ పాలకులతో అంటకాగిన వారి స్వంత చరిత్ర గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి.

           ఆకాశాన్నంటుతున్న ధరలు, తీవ్ర స్థాయిలో నిరుద్యోగం, నానాటికి తీవ్రమవుతున్న ఆర్ధిక-రైతాంగ సంక్షోభాలు, మోడి ప్రభుత్వం పోషిస్తున్న ఆశ్రిత పెట్టుబదిదారి విధానంలో పెచ్చుమీరుతున్న అవినీతిల వల్ల భారత ప్రజలు నలిగిపోతుంటే, స్వయానా ప్రధానిచే నియమితుడైన సి.బి.ఐ ఉన్నతాధికారి లంచగొండి కేసును ఎదుర్కొంటుంటే, మోడికి - తన వానర సైన్యానికి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతి రంగంలో వారు తలపెట్టిన వినాశనానికి సమాధానం కరువైంది. కాబట్టి, ప్రజలను విడగొట్టి - వారి దృష్టి మరల్చడానికి అనేక దారులు వెతుకుతున్నారు. ఈ సంక్షోభాన్ని సమర్దవంతంగా ఎదుర్కోవాలంటే, మనందరం  బలమైన ఐక్యతను ప్రదర్శించాలి. సంఘి - భా.జ.పా ప్రణాళిక లోని "విభజించు - దృష్టి మరల్చు" ఎత్తుగడలను బట్టబయలు చేయాలి. ఈ దేశానికి తేరుకోలేని ప్రమాదం తలపెట్టగల సమర్దులుగా రుజువైన ప్రస్తుత పాలకులను, 1977 లో ఎమర్జెన్సీ హయాంను తిప్పికొట్టిన స్థాయిలో ఎన్నికల బరిలో ఓడించి ఇంటికి పంపవల్సిన అవసరం నెలకొంది.

No comments:

Post a Comment