ఎడిటోరియల్

Monday, October 22, 2018

పెద్ద మనుషుల ముసుగులో లైంగిక వేధింపులు ఇక సాగవు.

పెద్ద మనుషుల ముసుగుల్లో లైంగిక వేధింపులు ఇకపై సాగవు.

       నేను కూడా (metoo) లైంగిక వేదింపులకు గురయ్యానంటూ సామాజిక మాధ్యమ వేదికగా గత కొన్నివారాలుగా ఒక తుఫానులా ఉధ్యమం జరుగుతూ ఉంది. గత ఏడాది హాలివుడ్ లో హార్వే వెయిన్ స్టైన్ లాంటి వారి సహా అమెరికా దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో ఉన్నత హోదాలలోని వ్యక్తుల నుంచి తామెదుర్కొంటున్న లైంగిక వేదింపుల ఘటనలను గుర్తించాలని - నమ్మాలని డిమాండ్ చేస్తూ మొదలైన ఈ ఉధ్యమం ఇప్పుడు భారతదేశంలో మహిళలకు కూడా ఒక దారి చూపింది. సినిమా, మీడియా, విధ్యా, కళా రంగాలతో పాటు సామాజిక ఉధ్యమాలతో సహా పని ప్రదేశాలలో మహిళలపై వేదింపులకు అలవాటు పడ్డ పురుషుల అరాచకాలను, వారి నుంచి ఎదుర్కొన్న హింసను, వారివారి స్వీయ అనుభవాలను బయటపెడుతూ దేశవ్యాప్తంగా అనేకమంది మహిళలు ముందుకు వచ్చారు. ఆయా రంగాలలో ఉన్నత హోదాలలో ఉండి ఈ పనులకు పాల్పడిన మగవారి వల్ల ఏ విధంగా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితికి నెట్టివేయబడి వంటరితనం అనుభవించారో వివరిస్తూ, ఆ వంటరి తనాన్ని బద్దలుకొట్టి గౌరవమర్యాదలను, అధికారపు అహంకారాన్ని వెలగబెడుతున్న పురుషుల గురించి మాట్లాడే ధైర్యాన్ని, చేయూతను ఈ ఉధ్యమం కల్పించింది.
         సీనియర్ పాత్రికేయుడు, మోడీ కేబినెట్ లోని కేంద్రమంత్రి ఎం.జె.అక్బర్ తన సంపాదకత్వంలో నడిచిన పత్రికలు - వార్తా సంస్థలలో యువ మహిళా జర్నలిష్టులపట్ల ఎలా వ్యవహరించేవాడో మహిళా పాత్రికేయురాలు ప్రియా రమణి బట్టబయలు చేసింది. వెంటనే అనేక మంది మహిళలు ఈ కేంద్రమంత్రి నుంచి సుధీర్ఘకాలం ఎదుర్కొన్న లైంగిక దాడులను, వేదింపులను తమ స్వంత అనుభవాలను వివరిస్తూ బయటకు వచ్చారు.
          అక్బర్ రాజీనామాను, ప్రభుత్వం అతన్ని బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తడంతో అక్బర్ మరింత మొండికేసి రాజీనామా చేసేందుకు నిరాకరించటం, తనపై ఆరోపణలు చేసే వారికి అబద్దాలు ఆపాదించటమే కాక, #Metoo ఉధ్యమం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావడం వెనుక రాజకీయ ఎజెండా ఉందంటూ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా వ్యాఖ్యానించాడు. మంత్రి పదవిలో అక్బర్ ని కొనసాగించడం, అతన్ని వెనుకేసుకొచ్చిన తీరు గమనిస్తే వ్యవహారం సద్దుమణచాలని అటు భా.జ.పా ఇటు ప్రధాని మోడి ఏ విధంగా ప్రయత్నించారో స్పష్టంగా తెలుస్తోంది. ప్రియ రమణి గారిపై పరువు నష్టం కేసు వేసి  ఆవిడను బాహాటంగానే బెదిరించేందుకు అక్బర్ ప్రయత్నించాడు. కానీ ప్రియ రమణి ఆరోపణలను దృవపరుస్తూ మరో ఇరవై మంది మహిళలు అక్బర్ వల్ల స్వయంగా తాము ఎదుర్కొన్న వేదింపులను కూడా బయట పెట్టడంతో చేసేదేమి లేక తప్పని పరిస్థితిలో రాజీనామా సమర్పించడం జరిగింది. ఈ ఉదంతం మొత్తం #నేనుకూడా (#metoo) ఉధ్యమం ఎంత విజయం సాధించిందో రుజువు చేస్తుంది.

         తనపై వచ్చిన ఆరోపణలన్ని రాజకీయ ఉద్దేశంతో చేసినవేనన్న అక్బర్ వ్యాఖ్యలు నిరాధారమైనవి.  ఎందుకంటే ఈ #నేనుకూడా (#metoo) ఉధ్యమం అన్ని రాజకీయ పక్షాల వారి పేర్లనూ తెరపైకి తెచ్చింది. అక్బర్,  నానాపటేకర్, చేతన్ భగత్, ఆలోక్ నాథ్ లాంటి మోడీ కాషాయ పక్ష సమర్దకుల పేర్లు బయట పడినట్లే, భా.జ.పాకు బద్ద వ్యతిరేకులుగా పేరున్న పాత్రికేయుడు వినోద్ దువా, కళాకారుడు జతిన్ దాస్ లాంటి వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి.
        లైంగిక వేదింపులకు సంబంధించిన అంశాన్ని రాజకీయ దృష్టి కోణంలో చూడరాదు. ప్రగతిశీల, వామపక్ష సంస్థలతో పాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కూడా బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంతో  వ్యవహరించి తమ పార్టీలు - సంఘాలలో కూడా లైంగిక వేధింపులను, స్త్రీ వ్యతిరేక భావజాలాన్ని నివారించేందుకు, ఆ ఉదంతాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలి. ప్రముఖులైన, ప్రభావంతమైన స్ధానాలలో ఉన్న వ్యక్తుల పేర్లు బయట పెట్టేటపుడు మహిళలు వారి మానసిక ప్రశాంతతను, వ్యక్తిగత భద్రతను, వారి ఉపాధి అవకాశాలను కొందరి విషయంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ పని చేస్తున్నారు. అటువంటి వారికి సమాజంలో అననుకూల పరిస్థితులు ఉన్నాయి. ఐదు సంవత్సరాల క్రితం సీనియర్ జర్నలిస్ట్ తరుణ్ తేజ్ పాల్ చేతిలో అత్యాచారానికి గురైన మహిళా పాత్రికేయురాలు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. తేజ్ పాల్ తన పలుకుబడితో పోలీసులను కోర్టులను ప్రభావితం చేసి న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడంలో సఫలమయ్యాడు.
        మహిళా ఫిర్యాదు దారులు పరువు నష్టం దావాల పేరుతో బెదిరింపులకు గురవుతున్నారు. ప్రియ రమణితో పాటు, ఆలోక్ నాధ్ పై రేప్ ఫిర్యాదు చేసిన సినీ నిర్మాత వింతానందా, నానా పటేకర్ పై లైంగిక వేదింపుల కేసు, పటేకర్ మద్దతు దారులపై గుంపు దాడి, హింస కేసులు నమోదు చేసిన తనుశ్రీ దత్తా పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన కేసులు ఫిర్యాదు దారులను బయపెట్టేందుకు, వారి నోరు నొక్కేందుకు ఉపయోగించబడుతున్నాయి. భాజపా పార్లమెంటు సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కు చెందిన సంస్థలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి, రాజీవ్ బందువుపై కేసు నమోదు చేసినందుకు తన ఉధ్యోగాన్ని కోల్పోయింది. రాజీవ్ బంధువు తనకు  వ్యతిరేకంగా సదరు మహిళ తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడ కుండా కోర్టు నుంచి గ్యాగ్ ఉత్తర్వులు (Gag Order) తెచ్చుకున్నాడు.
       కానీ మహిళలు ఎదురు తిరిగి పోరాడుతున్నారు. అక్బర్ మద్దతు దారులు తన నేరాన్ని తక్కువ చేసి చూపేందుకు "లైంగిక వేదింపుల విషయం కంటే తక్షణం పట్టించుకోవల్సిన    గ్రామీణ దళిత మహిళల వాస్తవ సమస్యలు అనేకం ఉన్నాయని దొంగ చిత్తశుధ్ధి ప్రదర్శిస్తున్నారు. అయితే సాతినిగా పనిచేస్తున్న బన్వరిదేవి అనే గ్రామీణ దళిత మహిళా ఉద్యోగిపై జరిగిన లైంగిక వేధింపు, గుంపు బలాత్కారం కేసులోనే సుప్రీంకోర్టు పని ప్రదేశాలలో మహిళల పై లైంగిక వేధింపులను అరికట్టేందుకు  ప్రఖ్యాత "1997 విశాఖ గైడ్ లైన్స్"  తీర్పును ఇచ్చిన విషయం వారందరూ గుర్తుచేసుకో వల్సిన విషయం. ప్రపంచ వ్యాప్తంగా పని ప్రదేశాలలో, ఫ్యాక్టరీలలో మహిళలను అదుపు చేసేందుకు విరివిగా ఉపయోగించే సాధనం లైంగిక వేధింపు, ఇందుకు భారతదేశం మినహాయింపు కాదు. ఈ #నేనుకూడా (#metoo) ఉధ్యమ ఫలితంగా అమెరికాలో ఇంటి పని చేసే వారికి, వ్యవసాయ కార్మికులకు, ఫ్యాక్టరీ, రెస్టారెంట్, సానిటేషన్ కార్మికులతో పాటు ఇతర కార్మికులకు విస్తృతంగా పాకిన లైంగిక వేధింపులను నిలువరించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇదే విధమైన చర్యలు మన దేశంలో  కూడా ప్రారంభం కావాలి.
            #మీటూ (#metoo) ఫిర్యాదు దారులకు న్యాయం చేసేందుకు నలుగురు విశ్రాంత న్యాయ మూర్తులతో కూడిన ప్యానల్ ఏర్పాటు చేస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనక గాంధీ వాగ్దానం చేయడం జరిగింది. కాని అటువంటి చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలు గాను ఉధ్యమ ఉధృతిని తగ్గించే చర్యలు గానే మనం అర్థం చేసుకోవాలి. అక్బర్ విషయంలో వీలైనంత కాలం మౌనం వహించడం, రాజీనామా జాప్యం చేయడం,
బంధువు వేధింపులను ఫిర్యాదు చేసిన మహిళా ఉధ్యోగిని నోరు మూయించేందుకు,శిక్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన వారి పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ చంద్ర శేఖర్ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టడానికి నిరాకరించడం లాంటి విషయాలు "భేఠి బచావో" అని వారిచ్చే నినాదాలలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

No comments:

Post a Comment