ఎడిటోరియల్

Monday, October 1, 2018

కుల రక్కసి కాటుకి బలౌతున్నది ఎవరు?

ఈ ప్రశ్నలకు బదులుందా?

కులాహంకార హత్యల మీద సోషల్‌ మీడియాలో అనుకూల, వ్యతిరేక వాదనలు చాలా జరుగుతున్నాయి. కొంతమంది 'మరి దళితులకు రిజర్వేషన్లు మాత్రం ఎందుకు?' అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

దానికి సమాధానంగా కింది పోస్టు వైరల్‌ అవుతోంది.

* మంచి బట్టలు వేసుకోకూడదని నీ మీద ఎప్పుడైనా దాడి జరిగిందా?
* తలపాగా పెట్టుకున్నావనీ, గుర్రమెక్కి ఊరేగావని నీ మీద ఎవరైనా దాడి చేశారా?
* బాగా చదువుతున్నావని రాళ్ళ దాడి ఎప్పుడైనా ఎదుర్కొన్నావా?
* ఇష్టమైన నాయకుడి పాట రింగ్‌ టోన్‌ పెట్టుకున్నాడన్న కారణంతో, ఘోరంగా హత్య గురైన వాడెవడైనా మీవారిలో ఉన్నాడా?
* ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే ఆడవాళ్ళను బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెట్టిన సందర్భాలు ఎవరి విషయంలో జరిగాయి?
* గుడిలోకి, బడిలోకి అడుగు పెట్టొద్దంటూ నిన్ను ఎవరైనా కొట్టి చంపారా?
* ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు తిరుగుతున్న చెరువులో కూడా నువ్వు మంచినీళ్ళు అంటుకోవడానికి వీల్లేదని నిన్నెప్పుడైనా ఆపారా?
* వేరే కులంవాడు తాగే గ్లాసు ముట్టుకున్నావని మలం నోట్లో పెట్టి తినమని కొట్టారా?
* ఎవరి అక్క చెల్లెళ్ళను జోగిని, బసివిగా చేశారు? చేస్తున్నారు?
* మంత్రాలు చేస్తున్నావనే నెపంతో ఊరంతా కలిసి చెట్టుకు కట్టేసి, కొట్టి చంపి సజీవ దహనాలు ఎక్కడ చేశారో చూపించు?
* అగ్రకుల ఊరి పెద్ద కనిపిస్తే లేచి కూర్చోలేదనే కారణంతో వికలాంగురాలని కూడా చూడకుండా, ఆడవాళ్లను నగంగా ఊరేగించిన సందర్భం ఎవరిలో జరిగింది?
* అమ్మాయిని ప్రేమిస్తే- ఆ అబ్బాయి ఇంట్లో ఆడవాళ్ళను సామూహిక అత్యాచారం చేయాలని ఎవరి విషయంలో పంచాయతీలు తీర్పులిచ్చాయి?
ఒక ఖైర్లాంజీ, ఒక చుండూరు, ఒక కారంచేడు, ఒక నీరుకొండ, ఒక ప్యాపిలి, ఒక కిలవెన్మని, ఒక వేంపెంట, ఒక దాద్రి, ఒక నోయిడాఘర్‌ ... నా ప్రజలను కాటేసిన కుల రక్కసి రక్త దాహానికి తార్కాణాలు. బహుజనుల మీద రోజూ జరుగుతున్న దాడులకు మరుగు దొడ్ల నుంచి పార్లమెంటు మెట్ల దాకా అన్నీ సాక్ష్యాలే! మరి ఇలాంటి వివక్షా, అమానుషం ఇంకెవరి విషయంలోనైనా ఉందా?

No comments:

Post a Comment